Tuesday, November 25, 2008

నేను సైతం .....

తెలుగుకు ప్రాచీనభాష హోదా వచ్చింది. కాని ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే అసలు తెలుగు భాషే అంతరించి పోయే ప్రమాదం పొంచి ఉందనిపిస్తోంది. ఇది వట్టి ఊహ కాదు. పచ్చి నిజం. ప్రస్తుత తెలుగు కవిపుంగవులకు వారి గొప్పలు వాళ్ళు చెప్ప్పుకోవటనికే సమయం చాలదు. ప్రభుత్వాలకి తమ ఉనికిని కాపాడుకోవటంలో ఉన్న శ్రద్ధ చదువులపైకి పోదు. పోతే, ఇలాంటి పని ఎందుకు చేస్తారు? అదే, పాఠశాలలో తెలుగు మాధ్యమాన్ని తీసేసి ఆంగ్లాన్ని ప్రవేశపెట్టటం. వాళ్ళ ఏడుపేదో వాళ్ళు ఏడిస్తే బాగుంటుంది. ఇలా సిగ్గూ ఎగ్గూ లేకుండా తగుదునమ్మా అని విద్యావిషయాలలో బుర్రపెట్టదానికి వీళ్ళకున్న అర్హత ఏమిటి? బొడ్డు కోస్తే అక్షరం ముక్క లేని అడ్డమైన వాళ్ళు మంత్రులై పోవడం, తగుదునమ్మా అని అన్ని విషయాలలోను వేలు పెట్టడం. తెలుగు భాష ఏమైనా పోనీ, మన పేరు హోరెత్తుతే చాలనుకొనే కవి పుంగవులు ఆ రాజకీయ అవినీతిపరులకు తాళం వెయ్యటం. చేతులూపుకుంటూ చెప్పేశాడు, పెద్దమనిషి మన ముఖ్యమంత్రి పేదలకు కూడా డబ్బున్నవాళ్ళకి మాత్రమే అందుబాటులో ఉన్నకాన్వెంటు విద్య అందిస్తుంది తమ ప్రభుత్వమని. వాళ్ళూ పెద్ద పెద్ద ఉద్యోగాలచెయ్యటానికి ఇది పనికి వస్తుందట. మింగటానికి మెతుకు లేని వాళ్ళకి మీసాలకు సంపెంగ నూనె వ్రాస్తారుట. పట్టణాలలో ప్రతిఒక్కరూ పట్టుబట్టి తెలుగు భాష, సంస్కృతులను మట్టి కలిపేశారు. పోనీ పల్లెటూళ్లలో అక్కడో ఇక్కడో తెలుగుతనం ఉందనుకుంటే అదీ మంట కలిపేయటానికి నడుం కట్టేరు ప్రభువులు.

కర్ణుడు చావుకి ఎన్నో కారణాలు. తెలుగుభాష, సంస్కృతి మాయమవుతుండటానికి అంతకుమించి కారణాలు. నేడు తెలుగువాడు వేరొక తెలుగువాడితొ తెలుగులో మాట్లాడటానికే సిగ్గుపడుతున్నాడంటే, రెండు వాక్యాలు తెలుగులో మాట్లాడితే రెండొందల ఆంగ్ల పదాలను వాడటమే గొప్పనుకునే స్తితికి దిగజారేడంటే ఎక్కడికి పోతోంది మన భాష, మన సంస్కృతి?

"నేను సైతం
నల్లరంగుని
తెల్లజుట్టుకు రాసి దువ్వేను
ఇంత చేసీ
ఇంత క్రితమే
తిరుపతయ్యకు జుట్టు నిచ్చేను"

ఇలానే ఉంది మన భాషా, సంస్కృతుల ప్రస్తుత దుస్తుతి.

తెలుగు ఉనికిని కాపాడాలంటే ఇది మనలాంటి సామాన్యుల వలనే సాధ్యం. మనందరం దీనికి సమాయత్తం కావాలి.
ఏదో ఒక గొడుగు కిందికి అందరూ చేరాలి. సంఘటితంగా కృషి చెయ్యాలి. కార్యాచరణకు నడుం కట్టాలి. ఈ బృహత్కార్యానికి "ఈ-తెలుగు" సంఘం ముందుకొస్తోంది. మన అభిప్రాయాలు నిర్మొహమాటంగా చెప్పి కార్యాచరణకు మన వంతు సహకారం అందిద్దాం.

క్రింది లంకె చూడండి

http://etelugu.org/node/138

ఇక్కడ ఈ విషయమై జరుగుతున్న చర్చలో భాగస్వామ్యులు కండి. తెలుగుని నిలబెట్టండి.

No comments: